కలం, మునుగోడు (చండూరు) : చండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన వడ్ల దొంగతనం (Chandur Paddy Theft Case) వ్యవహారం సినిమా స్టోరీని తలపిస్తోంది. చోరీ చేసిన వారినే మరికొందరు బెదిరించి దోపిడీ చేయడం సంచలనంగా మారింది. ఈ కేసును నల్గొండ పోలీసులు ఛేదించి 11 మందిని అరెస్ట్ చేశారు.
అసలు ఏం జరిగింది?..
చండూర్ మార్కెట్ యార్డ్ గోదాంలో 2025-26 సీజన్ కు సంబంధించి రైతుల నుండి సేకరించిన సుమారు 25,000 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. ఇందులో కొంత ధాన్యాన్ని మిల్లుకు తరలించిన తర్వాత సుమారు 13,000 క్వింటాళ్లు గోదాంలో ఉండాలి. అయితే గోదాం పరిశీలించగా షట్టర్ తాళం వద్ద ధాన్యం చిందరవందరగా ఉండటం, బస్తాలు లాగిన ఆనవాళ్లు కనిపించాయి. లెక్కలు చూడగా సుమారు రూ.7 లక్షల విలువైన 600-700 బస్తాల ధాన్యాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. ఘటనపై మార్కెట్ యార్డు బాధ్యులు తెలుకుంట్ల శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
దొంగతనం ఎలా చేశారు?
విచారణలో నిందితుడు నాగిళ్ల ఆంజనేయులు చండూర్ మార్కెట్ యార్డ్ లో ట్రేడ్ లైసెన్సు హోల్డర్ గా, అప్పుడప్పుడు హమాలిగా పనిచేస్తుంటాడని తేలింది. రెండు నెలల క్రితం అతనికి గోదాం తాళం చెవి దొరకగా, దాన్ని నకిలీ తాళంగా మార్చి బొమ్మోజు ప్రకాష్ (డ్రైవర్), మెతరి నాగేష్ లతో కలిసి బొలెరో వాహనంలో రాత్రివేళ వడ్లను దొంగతనం చేసి సూర్యాపేట మార్కెట్ లో అమ్ముకునేవాడు.
దొంగను దోచిన దొంగలు…
ఇదే క్రమంలో జులై 18 రాత్రి నాగిళ్ల ఆంజనేయులు, బొమ్మోజు ప్రకాష్ దొంగతనంగా వడ్లు లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దోటి వెంకన్న, వేముల పవన్, మండల సాయిలు తదితరులు వారిని పట్టుకొని “మీ దొంగతనాన్ని వీడియో తీశాం, పోలీసులకు చెబుతాం, చంపేస్తాం” అని బెదిరించి నాగిళ్ల ఆంజనేయులు వద్ద నుండి రూ.5 లక్షలు వసూలు చేశారు.
ఫిర్యాదుపై డీఎస్పీ శివరాంరెడ్డి ఆదేశాలతో సీఐ టి.రాము, ఎస్ఐలు సురేష్, నవీన్ తో కలిసి 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం రూ.9.80 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో కొందరిపై గతంలోనే కేసులు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ధాన్యం గోదాంకు ఒకే తాళం, సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రి కాపలా లేకపోవడం వల్లే ఈ దొంగతనం జరిగింది. రైతుల చెమటతో పండిన పంటను కాపాడాల్సిన మార్కెట్ యార్డ్ యాజమాన్యం నిర్లక్ష్యం ఈ కేసులో బయటపడింది. ఇప్పటికైనా అన్ని గోదాంలకు డబుల్ లాకింగ్, సీసీ కెమెరా, నైట్ వాచ్ మెన్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

