కలం, వెబ్‌డెస్క్: నేపాల్ వరద (Nepal Floods)ల్లో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన యువతి గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. 288 మంది భారతీయులు వరదల్లో గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ నేడు అధికారికంగా వెల్లడించింది. అయితే తాజాగా వీరిలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్‌బీనగర్‌కు చెందిన సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె ఈ నెల 19న ఆస్ట్రేలియా నుంచి తన స్నేహితురాలితో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ బయలుదేరారు. ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ద్వారా మొత్తం 29 మంత్రి బృందంతో సుహాసిని యాత్రకు వెళ్లారు.
ఇక బుధవారం నేపాల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే మంగళవారం రాత్రి నుంచే సుహాసిని ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. వరదల వార్త తెలిసి మరింత భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి సుహాసిని నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమ కుమార్తెను కాపాడాలని వేడుకుంటున్నారు.

