కాకతీయ.. ఇదేం డిబార్ మాయ..!?

కలం, నిర్మల్: ఐదు సెమిస్టర్లు విజయవంతంగా పూర్తి చేసి, ఆరో సెమిస్టర్ పరీక్షలు రాసి డిగ్రీ పూర్తవుతుందని ఆశించిన ఓ విద్యార్థినికి కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) ఫలితాలలో ‘ఎంపీ’ (Malpractice) రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాను ఏ పరీక్షలోనూ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడలేదని చెబుతున్న విద్యార్థిని.. తనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన బర్కుంట గంగాభవాని నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం (సీఏ) చదివింది. గత ఏప్రిల్/మే నెలలో నిర్వహించిన ఆరో సెమిస్టర్ పరీక్షలకు హాల్‌టికెట్ నంబర్ 177242212తో హాజరైంది. అంతకుముందు ఐదు సెమిస్టర్లను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. ఆరో సెమిస్టర్‌లోనూ మంచి మార్కులు సాధించి డిస్టింక్షన్‌తో డిగ్రీ పూర్తి చేయాలని ఆశించింది. అయితే జూన్‌లో వెలువడిన ఫలితాల్లో ‘ఎంపీ’ (మాల్‌ప్రాక్టీస్) అని ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

అసలు ఏం జరిగింది?

ఫలితాలలో మాల్‌ప్రాక్టీస్‌గా పేర్కొనడంతో గంగాభవాని తీవ్ర ఆవేదనకు గురైంది. అనంతరం పరీక్ష కేంద్రానికి వెళ్లి తన ఫలితంపై ఆరా తీసింది. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాను పరీక్షలకు హాజరైనట్లు నిర్ధారించే ఫొటో అటెండెన్స్ షీట్లు, కళాశాల నుంచి పొందిన లేఖతో కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆమె వాపోయింది. సాధారణంగా పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ విద్యార్థి పట్టుబడితే సంబంధిత సమాధానపత్రాన్ని స్వాధీనం చేసుకోవడం, డిబార్ చేయడం వంటి చర్యలు చేపడతారని చెబుతున్నారు.

డిబార్‌కు సంబంధించిన వివరాలను డీబార్ ప్రొఫార్మా, ఫొటో అటెండెన్స్ షీట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్, విద్యార్థి వివరణలు, హాల్‌టికెట్, పట్టుబడిన మెటీరియల్ తదితర వివరాలను రికార్డులలో పొందుపరచడంతో పాటు సంబంధిత సమాధానపత్రాన్ని ఇతర జవాబుపత్రాల నుంచి వేరు చేసి సీల్డ్ కవర్‌లో విశ్వవిద్యాలయానికి పంపే ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే తన విషయంలో ఇలాంటి ప్రక్రియకు సంబంధించిన ఆధారాలను అధికారులు చూపించలేదని గంగాభవాని చెబుతోంది. తాను అన్ని పరీక్షలకు హాజరైనట్లు ఫొటో అటెండెన్స్ షీట్లు ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం ‘ఎంపీ’గా ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నిస్తోంది.

ఆధారాలు ఎక్కడ?

గంగాభవాని నిజంగానే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే అందుకు సంబంధించిన ఆధారాలు ఏమిటి? పరీక్ష కేంద్రంలో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? డీబార్ ప్రొఫార్మా ఎక్కడ ఉంది? ఇన్విజిలేటర్ వివరణ తీసుకున్నారా? విద్యార్థిని నుంచి వివరణ కోరారా? పట్టుబడిన మెటీరియల్ ఏదైనా ఉందా? సమాధానపత్రాన్ని ప్రత్యేక కవర్‌లో పంపించారా? ఫొటో అటెండెన్స్‌లో డీబార్ వివరాలు నమోదు చేశారా? ఫలితాన్ని నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నది ఎవరు? అందుకు ఆధారం ఏమిటి? అనే ప్రశ్నలకు విశ్వవిద్యాలయ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉందని విద్యార్థిని కోరుతోంది. ఈ అంశంపై గంగాభవాని జూలై 29న, ఆగస్టు 4న, ఆగస్టు 20న పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని తెలిపింది.

పొరపాటా.. సాంకేతిక లోపమా?

పరీక్షల నిర్వహణలో ఫలితాల ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, డిజిటల్ రికార్డులు, ఫొటోగ్రాఫిక్ అటెండెన్స్ వంటి అనేక ప్రక్రియలు ఉంటాయి. వీటిలో ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సాంకేతిక లేదా సంస్థాగత తప్పిదానికి విద్యార్థిని బాధ్యురాలిగా చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇది సాంకేతిక లోపమైతే వెంటనే సరిదిద్దాల్సిన బాధ్యత అధికారులదే. సిబ్బంది నిర్లక్ష్యం కారణమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కారణం ఏదైనా.. దాని ప్రభావాన్ని మాత్రం ఓ విద్యార్థిని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘ఎంపీ’.. రెండు అక్షరాలు.. భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం

ఫలితాల్లో కనిపించే ‘ఎంపీ’ అనే రెండు అక్షరాలు చిన్నవిగానే కనిపించినా.. వాటి ప్రభావం విద్యార్థి భవిష్యత్తుపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఫలితం నిలిచిపోవడంతో డిగ్రీ పూర్తికావడం ఆలస్యం కావచ్చు. ఉన్నత విద్యలో చేరే అవకాశాలు దెబ్బతినవచ్చు. డిగ్రీ ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

న్యాయం జరిగే వరకు పోరాడతా

“ఏ పరీక్షలోనూ నేను మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడలేదు. ఐదు సెమిస్టర్లు బాగా చదివి పాసయ్యాను. ఆరో సెమిస్టర్‌లోనూ మంచి ఫలితాలు వస్తాయని భావించాను. కానీ ఫలితాల్లో ‘ఎంపీ’ అని రావడంతో తీవ్రంగా బాధపడ్డాను. అధికారుల తప్పిదానికి నేను యూనివర్సిటీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. సమయం, డబ్బు రెండూ నష్టపోతున్నాయి. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. తప్పిదం జరిగితే సరిదిద్ది న్యాయం చేయాలి. లేదంటే బాధ్యులపై చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా” అని బాధిత విద్యార్థిని గంగాభవాని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>