22ఏ భూదందాపై రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్యే ఏలేటి లేఖ

కలం, నిర్మల్ : రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti) ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 22ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 22ఏ జాబితాలో ఉన్న భూములెన్ని? కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి చేరిన భూములెన్ని? అనే వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. నిషేధిత భూముల పూర్తి జాబితాను పబ్లిక్‌ డొమైన్‌ లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన భూ బదలాయింపుల ఆధారాలను చూపించేందుకు తాను అసెంబ్లీ మీడియా పాయింట్‌ కు వెళ్లగా మంత్రి అక్కడికి రాకుండా తప్పించుకున్నారని విమర్శించారు.

భూముల వ్యవహారంలో తప్పు జరగకపోతే మంత్రి క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భూ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రి పొంగులేటిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో కుట్ర జరిగిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో అవినీతి జరిగిందని ఆరోపించిన సీఎం రేవంత్‌రెడ్డి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి మంత్రులకు వజ్రాల హారంలా మారిందంటూ ఎద్దేవా చేశారు. భూ వ్యవహారాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కుట్ర అంటూ కొట్టిపారేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 22ఏ భూముల వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి లేఖ పంపిస్తున్నట్టు తెలిపారు. భూ వ్యవహారంలో దోషులు ఎవరైనా తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>