డెంగ్యూ అనుమానిత బాలిక మృతి.. వనపర్తిలో హై అలర్ట్

కలం, వనపర్తి: డెంగ్యూ (Dengue) అనుమానిత లక్షణాలతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందడంతో వనపర్తి (Wanaparthy) జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (Health Department), అప్రమత్తమైంది. వనపర్తి గాంధీనగర్‌కు చెందిన ఆంజనేయులు కుమార్తె వెన్నెల ఈ నెల 24న మృతి చెందింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ బుధవారం గాంధీనగర్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు 18, 19, 20 వార్డులలో ఆరోగ్య శాఖ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఇళ్లలో పైరిత్రం స్ప్రే చేయడంతో పాటు నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించారు. డెంగ్యూ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నొస్టిక్, వనపర్తికి పంపించారు. జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఫీవర్ సర్వే కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వృద్ధికి అవకాశం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం, ఇతర అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ వంశీకృష్ణ, స్థానిక వైద్యాధికారి నదియా, పీర్లగుట్ట వైద్యాధికారి డాక్టర్ క్లెవిన్, గాంధీనగర్ ఆరోగ్య విస్తరణ అధికారి రవీంద్ర గౌడ్, సబ్‌యూనిట్ అధికారి ఓం ప్రకాశ్, ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహారావు, జిల్లా యాంటీ లార్వా బృందం సభ్యులు గంధం రాజు, గోపాల్‌రెడ్డి, సతీష్‌కుమార్, స్థానిక వైద్య సిబ్బంది రాము, ఆరోగ్య సహాయకులు సుమిత్ర, సుగుణ, ఏఎన్‌ఎంలు, పీపీ యూనిట్ సిబ్బంది, గాంధీనగర్ ఆశా కార్యకర్తలు, బ్రీడింగ్ చెకర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>