కలం, జనగామ: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాలు కీలకపాత్ర పోషించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత (CP Shweta) పిలుపునిచ్చారు. బుధవారం జనగామ జిల్లా (Jangaon) కలెక్టరేట్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్ర–మాదకద్రవ్యాల నిర్మూలన’పై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డ్రగ్స్, గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే 112కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ (CP Shweta) తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడకుండా చికిత్స, పునరావాసం కల్పించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలోని సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యుల ద్వారా ప్రతి ఇంటికీ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన తీసుకెళ్లవచ్చని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంపై అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డీ-అడిక్షన్ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలన్నారు. సదస్సులో సైకాలజిస్ట్ డా. విజయక్రాంతి అవగాహన కల్పించగా, పోలీస్ జాగృతి కళాబృందం నాటికల ద్వారా సందేశాన్ని అందించింది.
Also Read : కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు!
Follow Us On: X(Twitter)

