కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను, భూములను అమ్ముకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే రూ. 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ ప్రభుత్వం అమ్మేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో 22A బాధితులు హరీశ్ రావు ను కలిసి తమ బాధను విన్నవించారు. స్పందించిన హరీశ్ రావు.. బాధితులకు బీఆర్ఎస్ పక్షాన అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ది ప్రజల కేంద్రంగా పాలన అయితే.. రేవంత్ రెడ్డిది భూముల కేంద్రంగా పాలన అంటూ విమర్శించారు. హైదర్‌నగర్‌లో పిల్లలు ఆడుకునే పార్కు స్థలాన్ని కూడా సర్కార్ అమ్మకానికి పెట్టిందని దుయ్యబట్టారు. సామాన్యుల భూములను 22Aలో పెట్టి వేధిస్తున్నారని.. కానీ సీఎం బంధువులకు మాత్రం విలువైన ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా భూములన్నీ అమ్ముకుంటూ పోతే రేపటి భవిష్యత్ తరాలకు ఒక గుడి, మసీదు, చర్చి నిర్మించాలన్నా, ఆసుపత్రి, స్కూల్, వాటర్ ట్యాంక్ కట్టాలన్నా.. కనీసం చనిపోతే దహన సంస్కారాలకు వైకుంఠధామం నిర్మించడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి వస్తుందని విమర్శించారు. లక్షలాది మంది పేదలకు భరోసాగా ఉన్న భూములను లాక్కొని దళారుల ద్వారా కమీషన్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

