కలం, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యల దుమారంపై కాంగ్రెస్ పార్టీలో రాయబారాలు వేగవంతమయ్యాయి. ఈ వివాదంపై అధిష్టానం తీవ్ర అగ్రహంతో ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొండా మురళి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీకి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వివాదాన్ని సదుమణియం చేసేందుకే ఈ ముఖ్య నేతలంతా భేటీ అయినట్లు సమాచారం.
భేటి అనంతరం కొండా కామెంట్స్..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయిన అనంతరం కొండా మురళి (Konda Murali) మీడియాతో మాట్లాడారు. ఓ బిల్లు విషయమై చర్చించేందుకే తాము భట్టీని కలిశామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గత విషయాలపై స్పందిస్తూ, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని వ్యాఖ్యానించారు.
పార్టీ కమిటీకి తమ వైపు నుంచి చెప్పాల్సింది స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై వస్తున్న ప్రశ్నలకు స్పందిస్తూ, ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదని, తమ బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే పూర్తి హక్కు ఉందని కొండా మురళి స్పష్టం చేశారు. తమ కుటుంబానికి గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

