కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న ఖువాడియా హిల్స్ వద్ద 19 ఏళ్ల కునాల్ చాంద్గుడే, అతడి తల్లిదండ్రులు మరణించిన విషాదకర సంఘటన (Sambhajinagar Tragedy)కు ఐఫోన్ వివాదం కారణం కాదని మహారాష్ట్ర పోలీసులు తమ ప్రాథమిక విచారణలో స్పష్టం చేశారు. ఈ త్రిపుల్ సూసైడ్ వెనుక గల అసలు కారణం దీర్ఘకాలంగా నడుస్తున్న కుటుంబ తగాదాలేనని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో తండ్రి మురళీధర్, తల్లి సంగీత, కుమారుడు కునాల్ మృతి చెందారు.
పోలీసుల సమాచారం ప్రకారం, కునాల్ తన తండ్రిని తిరిగి ఇంటికి రప్పించి, దంపతులిద్దరూ ఇకపై కలసి జీవించేలా ఒప్పించాలనే ఉద్దేశంతోనే కొండ అంచు వద్దకు వెళ్లాడు. ఈ దంపతుల పెద్ద కుమారుడు ఆరేళ్ల కిందటే అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తర్వాత ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మురళీధర్, కుటుంబ వివాదాల వల్ల పనిలోనే కాలం గడుపుతూ నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవారు.
ఈ విషాదం జరగడానికి రెండు రోజుల ముందే మురళీధర్ ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఘటనకు ఒక రోజు ముందు కునాల్ తల్లి సంగీత తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆమె మానవ సంబంధాలు, ప్రేమ విలువలను వివరిస్తూనే, కొందరు బంధువులపై సంచలన ఆరోపణలు చేశారు. తమ కుటుంబాన్ని మానసికంగా వేధించారని, ఆస్తి తగాదాలు సృష్టించి తమ శాంతిని దూరం చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, సంగీత బంధువులు మాట్లాడుతూ.. మురళీధర్-సంగీత దంపతుల మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు ఉన్నాయని, అందుకే వారు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులిద్దరూ మళ్లీ కలిసి సంతోషంగా ఉండాలని కునాల్ బలంగా కోరుకున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం సంగీత యూట్యూబ్ వీడియోలో చేసిన ఆరోపణలను ఆధారం చేసుకుని పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

