యూరియా కొరత.. మెద‌క్ రైతులకు నరకయాతన..!

క‌లం, మెద‌క్ బ్యూరో : మెద‌క్ (Medak) జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. వరి నాట్లు వేసి నెలలు గడుస్తున్నా సకాలంలో యూరియా (Urea Shortage) అందక ఉమ్మ‌డి మెదక్ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ యాప్​ ల పేరిట ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మంపడుతున్నారు.

యూరియా యాప్‌లో సర్వర్ డౌన్ కావడం, సమయానికి OTPలు రాకపోవడం, స్టాక్ పూర్తయినా అదనంగా బుకింగ్ కావడం వల్ల గందరగోళం నెలకొంది. గ‌తవారం రోజులుగా యూరియాకు జిల్లావ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్ప‌డింది.. అయితే డిమాండ్ అనుగుణంగా యూరియా స‌ర‌ఫరా కాక‌పోవ‌డంతో రైతులు రోడ్లెక్కుతున్నారు.

యూరియా యాప్ కష్టాలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు పూర్తయి పంట ఎదుగుదల దశకు చేరుకోవడంతో రైతులకు యూరియా అత్యవసరంగా మారింది. అయితే, పొలాల్లో వేయడానికి ఎరువులు దొరక్క అన్నదాతలు తీవ్రంగా అల్లాడుతున్నారు. అధికారులు అవ‌స‌ర‌మైన యూరియా అందుబాటులో ఉంద‌ని చెబుతున్న‌ప్ప‌టికి క్షేత్ర‌స్థాయిలో రైతులకు స‌కాలంలో యూరియా అంద‌డం లేదు.

పాస్ పుస్తకాలు పట్టుకుని తెల్లవారుజాము నుంచే సహకార సంఘాలు, ఫెర్టిలైజర్ షాపుల వద్ద క్యూ కడుతున్నా యూరియా దొర‌క‌డం లేదు. దీంతో గ‌త కొన్ని రోజులుగా ప‌లు ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం రొడ్డెక్కి అందోళ‌న చేస్తున్నారు. యాప్ ద్వారా యూరియా‌ను బుక్ చేసుకొవ‌డం రైతులుకు పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది.

మంగ‌ళ‌వారం రోజున జిల్లాలోని చిన్న శంకరంపేట, మడూర్, జంగారాయి సొసైటీలతో పాటు గవ్వలపల్లి డీసీఎంఎస్ (DCMS) ఎరువుల దుకాణాలకు సుమారు 2,000 యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, బుకింగ్ ప్రారంభమైన కేవలం నిమిషంలోపే ‘నో స్టాక్’ అని చూపిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎరువులు కొనడానికే అప్పులు చేస్తుంటే, యాప్‌ల కోసం స్మార్ట్‌ఫోన్లు ఎలా కొనాలని ప్రశ్నించారు. మ‌రొవైపు యూరియా బుక్ అయినా వారు ఉదయం నుంచే పనులు మానుకుని క్యూలైన్లలో నిల్చుంటే, ఇప్పుడు బస్తాలు అయిపోయాయని చెప్పడంపై సొసైటీ సిబ్బంది, వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఓ వైపు వ‌రి పైరుకు యూరియా వేయాల్సిన సమయం దాటిపోతుండటం, మరోవైపు షాపుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్‌కు తగ్గట్టు లేని సరఫరా

వానకాలం సీజ‌న్ ప్రారంభ‌మైన త‌ర్వాత మెద‌క్ జిల్లా వ్యాప్తంగా జూన్ నెల‌లో 3,650 మెట్రిక్ ట‌న్నుల యూరియా అవ‌స‌రం ఉండ‌గా 4,040 మెట్రిక్ ట‌న్నులు స‌ర‌ఫారా చేశారు. జూలైలో 7,890 మెట్రిక్ ట‌న్నులు అవ‌స‌రం ఉండ‌గా, 7,180 మెట్రిక్ ట‌న్నులు స‌ర‌ఫారా చేశారు. ఆగస్టులో 8,680 మెట్రిక్ ట‌న్నులు అవ‌స‌రం ఉండ‌గా, ఇప్ప‌టికి వ‌ర‌కు 5,420 మెట్రిక్ ట‌న్నుల మాత్రమే స‌ర‌ఫారా చేశారు. ఆగస్టులో పంటలకు యూరియా అత్యవసరమైన సమయంలో ఏకంగా 3,260 మెట్రిక్ టన్నుల లోటు ఉండటంతో క్షేత్రస్థాయిలో కొరత తీవ్రరూపం దాల్చింది.

సిద్దిపేట డివిజ‌న్ ప‌రిధిలో గత ఏడాది 86 వేల ఎకరాలుగా ఉన్న వరి సాగు, ఈ వానాకాలంలో 73 వేల ఎకరాలకు పడిపోయింది. వరి స్థానంలో కంది, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు సాగయ్యాయి. వానాకాలం సీజన్‌కు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు కేవలం 4,500 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయింది. అవ‌స‌ర‌మైన యూరియాలో మూడ‌వ వంతు మాత్ర‌మే రైతులకు స‌ర‌ఫ‌రా చేశారు. వర్షాలు అలస్యం అయినా నాట్లు వేసిన త‌ర్వాత యూరియా స‌ర‌ఫ‌రా సరిపడా లేక‌పోవ‌డంతో అందోళ‌నలు చేస్తున్నారు.

అక్రమార్కుల బ్లాక్​ దందా..!

ఒకవైపు యూరియా దొరక్క సాధారణ రైతులు అల్లాడుతుంటే, మరోవైపు కొంతమంది దీనిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. అందులో వ‌రి పంటసాగు గతంలో పోల్చితే కొంత‌మేర త‌గ్గింది. దీంతో 10 ఎకరాలు ఉన్నవారు 5 ఎకరాల్లోనే సాగు చేసినప్పటికీ, రికార్డుల ప్రకారం వారికీ 20 బస్తాల వరకు కేటాయింపులు జరుగుతున్నాయి.

తమకు అవసరమైన 10 బస్తాలు ఉంచుకుని, మిగిలిన 10 బస్తాలను డీలర్ల ద్వారా బస్తాకు 500 వరకు అదనంగా ఆశించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మ‌రొవైపు వ‌రి పంట వేయ‌ని వారు, నీటి కొర‌తతో సాగు చేయ‌ని వారు సైతం యాప్ లో యూరియాను బుక్ చేసి, అవ‌స‌రం ఉన్న రైతుల‌కు ఎక్కువ‌రేటు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. మార్కెట్ లో స‌ర‌ఫరా త‌క్కువ‌ ఉండ‌టంతో పాటు, స‌కాలంతో యూరియా వేయ‌ల్సిన అవరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు బ్లాక్​ మార్కెట్​ దందా చేస్తున్నారు.

మొన్నటి వరకు వానల కోసం వేచిచూసి వ్య‌వ‌సాయం చేయ‌లంటేనే అనేక క‌ష్ట‌న‌ష్టాలు పడ్డామ‌ని, ఇప్పుడు త‌మ‌ పంటలు న‌ష్ట‌పోకుండా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, ఎరువుల కొరత లేకుండా సకాలంలో అవసరమైనంత యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. గతంలో మాదిరిగానే ఆధార్ కార్డు లేదా పట్టాదార్ పాస్ పుస్తకం ద్వారా నేరుగా దుకాణాల్లోనే యూరియా బస్తాలు అందించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>