చ‌దువుతో పాటు క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి: వీహెచ్‌

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని, చదువు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరుకొని, తల్లిదండ్రులు గర్వించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర బీసీ అభివృద్ధి సంక్షేమ సలహాదారు వి.హనుమంతరావు (Hanumantha Rao) ఆకాంక్షించారు. మంగళవారం ఆయన మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఎదిరలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో వన మహోత్సవం పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, విద్యార్థులతో ముచ్చటించారు.

విద్యార్థులతో సమావేశమై గురుకుల పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతి, విద్య, భోజనం తదితర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వి. హనుమంతరావు (Hanumantha Rao) మాట్లాడుతూ, విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ దశలో క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. విద్యార్థులు తమకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. విద్యార్థులు ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు రానున్న రోజుల్లో సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హనుమంతరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కాగా, జిల్లాకు చేరుకున్న బీసీ అభివృద్ధి, సంక్షేమ సలహాదారు వి.హనుమంతరావుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి విష్ణు నందన్, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, గురుకుల పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Also Read : నాటితే సరిపోదు.. బతికిస్తేనే భవిష్యత్తు: తుమ్మల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>