కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితాను సెప్టెంబర్ 7వ తేదీలోగా తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. లేకపోతే లక్షలాది మందితో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కంచె చేను మేసిన చందంగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజల ప్రాణాలు, ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. రేవంత్ తమ్ముడికి రూ.వందల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని, ప్రజల ఆస్తులను 22ఏ కింద పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
మంత్రి పొంగులేటిని తప్పించాలి..
ఒక్క ఎకరం కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు మండిపడ్డారు. వెంటనే ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని.. అలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్రంలోని భూములను పెట్టడమేంటన్నారు. పొంగులేటి నిషేధిత భూముల అవినీతిలో రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం లేకపోతే.. వెంటనే ఆయన్ను తప్పించి నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. పొంగులేటి డబ్బు దురాశనే ఆయన దుఃఖానికి కారణమవుతుందన్నారు. 30 శాతం కమీషన్ వసూళ్ల కోసం పొంగులేటి చేసిన కుట్ర వలన లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆగమైనట్లు తెలిపారు.

