కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు (Rega Kantha Rao) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన ఆస్తులను ప్రజలకు పంచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పాయం కూడా తన ఆస్తులను పంచేందుకు సిద్ధంగా ఉన్నారా? అని రేగా కాంతారావు బహిరంగ సవాల్ విసిరారు.
పినపాక నియోజకవర్గ పేదలకు తనకున్న ఆస్తులను పంచిపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ విషయంపై చర్చించడానికి మంగళవారం ఉదయం 10 గంటలకు మణుగూరులోని అంబేద్కర్ సెంటర్‌కు రావాలని ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్చించే దమ్ముందా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాంటి వాటికి తాను భయపడేది లేదని రేగా కాంతారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంటితోపాటు, ఒక గిరిజన నాయకుడికి చెందిన 186 గజాల స్థలాన్ని కూడా 22A కింద నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

