ఫార్మా కంపెనీల్లో ప్రమాద ఘంటికలు.. అధికారుల చర్యలేవి?

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి వెంట ఉన్న ఫార్మా కంపెనీల్లో రియాక్టర్ పేలుళ్లకు (Pharma Accidents) సాంకేతిక లోపాలే కాదు.. తనిఖీలు, పర్యవేక్షణ లోపాలు కూడా ఎన్నో కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో హైవే వెంట భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, చిట్యాల పారిశ్రామిక ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. యాజమాన్యాల మితిమీరిన లాభాపేక్ష, అవినీతికి పాల్పడే అధికార యంత్రాంగం పర్యవేక్షణ నిర్లక్ష్యం కలిసి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

మూడేండ్లలో 14 మంది మృతి

ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫార్మా పరిశ్రమల్లో మూడేళ్లలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. యాదాద్రి జిల్లా చందంపేట వద్ద ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో భారీ రియాక్టర్ పేలుడులో డైరెక్టర్ విక్రమ్ రెడ్డి సహా 6 మంది మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మలరామారం మండలంలోని సింబియోసిస్ ఫార్మాలో రసాయనాలు కలుపుతుండగా జరిగిన పేలుడులో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని హిందుస్థాన్ ఫార్మాలో కెమికల్ రియాక్టర్ వద్ద మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దండుమల్కాపూర్ సమీపంలోని స్విస్ ఫార్మాలో విషవాయువు లీకేజీ, ఫ్లాష్ ఫైర్ తో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో 14 మంది మృతిచెందారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.

లాభాల్లో యాజమాన్యాలు.. అధికారుల్లో అవినీతి

పరిశ్రమల ప్లాంట్లలో రియాక్టర్ల వద్ద పీడనం, ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ అత్యంత కీలకమైన అంశాలు. కానీ చాలా కంపెనీల్లో పాత యంత్రాలు, పనిచేయని అలారంలు, లోపభూయిష్ట సేఫ్టీ వాల్వ్‌లతోనే కొనసాగిస్తున్నారు. కనీస భద్రతా ఆడిట్లు నిర్వహించకుండా ఉత్పత్తి, లాభాలపైనే దృష్టి పెట్టడంతో ఇటీవల హేజెలో ల్యాబ్స్, నోష్ ఫార్మా, ఎస్ బీ ఆర్గానిక్స్ కంపెనీల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే వ్యయ నియంత్రణ పేరుతో ఫార్మా కంపెనీ యాజమాన్యాలు ప్రాణాపాయంతో కూడిన పని ప్రదేశాల్లో శిక్షణ పొందని ఇతర రాష్ట్రాల వలస కార్మికులను, కాంట్రాక్ట్ సిబ్బందిని తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నాయి. ప్రమాదకర రసాయనాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం, కనీస ప్రాథమిక భద్రతా పరికరాలు లేకపోవడంతో చిన్నపాటి సాంకేతిక లోపం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. మరోవైపు 3 నుంచి 4 నెలల పాటు వేతనాలు చెల్లించకపోయినా, అదనపు పని గంటలతో వేధించినా కార్మిక శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. మామూళ్లు తీసుకుంటూ పర్యవేక్షణ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.

కఠిన చర్యలకు దిగకుంటే కష్టమే..

ఫార్మా పరిశ్రమల్లో పదేపదే జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట ఉన్న అన్ని ఫార్మా యూనిట్లలో రూల్స్ అమలుపై థర్డ్ పార్టీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో తక్షణమే సమగ్ర భద్రతా ఆడిట్లు నిర్వహించాలని కోరుతున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతే, వాటిని కేవలం సాధారణ ప్రమాదాలుగా చూడకుండా నాన్-బెయిలబుల్ కేసులుగా నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి పరిశ్రమలోనూ పక్కాగా ఆటోమేటిక్ గ్యాస్ లీకేజీ అలారంలు, ప్రెషర్ రిలీఫ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతిక భద్రతా వ్యవస్థలు ఉన్న కంపెనీలకే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమల పురోగతి ముఖ్యమే అయినప్పటికీ, అది కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టకూడదని, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొని కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఫార్మా కంపెనీలు మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంటాయని పేర్కొంటున్నారు.

పైసలిస్తే ప్రాణాలు తిరిగొస్తాయా..?

ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికుడు చనిపోగానే కొన్ని లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి యాజమాన్యాలు కేసుల నుంచి తప్పించుకుంటున్నాయి. కానీ, డబ్బులు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..?. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం అనుభవించే తీరని లోటును ఎవరు పూడ్చుతారు.? వంటి ప్రశ్నలు బాధిత కుటుంబాల నుంచి వస్తున్నాయి. ఫ్యాక్టరీల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడిగా విచారణ కమిటీలు వేయడం, కొన్ని రోజులు ఫ్యాక్టరీని మూసివేయడం తప్ప విచారణ నివేదికలు బయటకు రావు, యాజమాన్యాలపై కఠినమైన క్రిమినల్ కేసులూ ఉండవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>