హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం.. ఇక కఠిన చర్యలే!

కలం, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​లో (Hyderabad) అనుమతుల్లేకుండా వెలుస్తున్న అక్రమ కట్టడాలపై పురపాలక శాఖలో సరికొత్త ఆలోచన మొదలైంది. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయిన ఘటన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అధికారులు పటిష్ట మెకానిజంపై కసరత్తు చేస్తున్నారు. అనుమతుల్లేని అక్రమ కట్టడాలను నియంత్రించడానికి పటిష్టమైన టౌన్ ప్లానింగ్ పాలసీ ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పడాలని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్స్, హైడ్రా, ఇరిగేషన్.. ఇలా పలు విభాగాల మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం లేని కారణంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నవారు ఒక విభాగం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామంటూ బుకాయిస్తున్నరని, విభాగాల మధ్య సమన్వయ లోపం వారు తప్పించుకోడానికి ఉపయోగపడుతున్నదనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో నెలకొన్నది.

అక్రమ నిర్మాణాలపై పూర్తి అధికారమెవరిది?

అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ అయిన తర్వాత వాటిపై చర్య తీసుకునే సంపూర్ణ అధికారం మున్సిపల్ కార్పొరేషన్‌కే ఉంటుందనే అంశంలో భిన్నాభిప్రాయం లేకపోయినా అమలు విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది అధికారుల భావన. ఇందుకోసం ప్రభుత్వానికి త్వరలో కొన్ని అంశాలను వివరించి యూనిఫామ్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఒక టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు, నిర్మాణాల తొలగింపులో హైడ్రా లాంటి విభాగాలకు అనుమతులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు పర్యవేక్షణా విభాగం, దానికి అవసరమైన సిబ్బంది కేటాయింపు, టౌన్ ప్లానింగ్ విభాగం బలోపేతం.. ఇలాంటివన్నీ అవసరమన్నది వారి అభిప్రాయం.

ఇదే విషయాన్ని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటుపై త్వరలో ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ విభాగం ఉనికిలోకి వచ్చి యాక్టివ్ అయితే పలు విభాగాల మధ్య సమన్వయం పెరిగి ఫలితాలు వస్తాయన్నది ఆమె వాదన.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>