మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై సస్పెన్స్.. అధికారుల ఆందోళన!

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ (Konda Surekha Controversary ) వ్యవహారం ఆమె నిర్వహిస్తున్న శాఖల సిబ్బందికి గుదిబండగా మారింది. ఇప్పటికీ ఆమె అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగానే కొనసాగుతున్నారు. మంత్రిగా ఆమె ఆదేశాలను అధికారులు పాటించక తప్పదు. మంత్రి హోదాలోనే ఆమె ‘వన మహోత్సవం’పై రివ్యూ చేశారు. జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగానే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా అటవీ శాఖ సిబ్బందిలో మాత్రం కన్‌ఫ్యూజన్ నెలకొన్నది.

ఆమె తీసుకునే నిర్ణయాలను అమలు చేయడమా?.. లేక కొంతకాలం పెండింగ్‌లో పెట్టడమా?.. అనే డైలమా కనిపిస్తున్నది. కీలకమైన ఫైళ్లను వీలైనంతగా ప్రాసెస్ చేయకుండా పెండింగ్‌లో పెట్టడమే ఉత్తమం అనే అభిప్రాయమూ కొందరిలో నెలకొన్నది. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘‘ఊహాగానాలకు తావు లేదు.. అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్..’’ అంటూ ముఖ్యమంత్రి ఒకింత క్లారిటీ ఇవ్వడం గమనార్హం.

అటవీ సిబ్బందిలో అయోమయం

కూతురు సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారా?.. లేక యథావిధిగా కొనసాగిస్తారా?.. అనే చర్చ సచివాలయవర్గాల్లో జోరుగా నడుస్తున్నది. ఈ ప్రభావం అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ సిబ్బందిపై పడింది. మంత్రిగా కొండా సురేఖ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే బాధ్యత ఒకవైపు.. మంత్రిగా కొనసాగడంపై సస్పెన్స్ నెలకొన్న పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే ఆందోళన మరోవైపు ఆఫీసర్లు మొదలు కింది స్థాయి సిబ్బంది వరకు వెంటాడుతున్నది.

దీంతో టేబుల్ ముందుకు వచ్చిన ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి మౌఖిక ఆదేశాలు లేదా ఇన్‌స్ట్రక్షన్స్ లేకపోయినా ఈ అయోమయం పలు స్థాయిల్లోని సిబ్బందిలో వ్యక్తమవుతున్నది. మంత్రి ఆమోదం తెలిపిన ఫైళ్ల విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలన్నది సిబ్బందికి మింగుడుపడడంలేదు. ఇలాంటి రాజకీయంగా పరిణామాల నేపథ్యంలో ఫైళ్ళ ప్రాసెసింగ్‌ సిబ్బంది మధ్యనే చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలం ఈ సస్పెన్స్ కంటిన్యూ

కీలకమైన, విధానపరమైన, దీర్ఘకాలిక ప్రభావం చూపే నిర్ణయాలపై తొందరపాటు అవసరమా అనే అనుమానాన్ని ఒక ఆఫీసర్ వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఫైళ్లను ప్రాసెసింగ్‌ చేసే విషయంలో అతి జాగ్రత్తలకు కారణమవుతున్నది. సాధారణ పరిపాలనా అంశాలు, ఇప్పటికే డెసిషన్ తీసుకున్న ఫైళ్లకు స్పష్టమైన విధానం అమలవుతుండగా, మంత్రి స్థాయిలో ఇకపైన కొత్తగా తీసుకోబోయే నిర్ణయం లేదా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం లేదా కీలకమైన క్లియరెన్స్ ఇచ్చే అంశం, విధానపరంగా ప్రభావం కలిగించే ఫైళ్ల విషయంలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘వెయిట్ అండ్ వాచ్’ అనేదే బెస్ట్ అని భావస్తున్నారు. హడివిడి పడి ఆమోదం తెలపడమో లేక ఉత్తర్వులు జారీచేయడమో వద్దని ఆలోచిస్తున్నారు. తుది ఆమోదం తెలిపేలాంటి ముఖ్యమైన ఫైళ్లను ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతనే అడుగేయాలనుకుంటున్నారు. ఇప్పటికింకా మంత్రి, అధికారుల మధ్య డిస్టర్బెన్స్ లేకపోయినా రానున్న రోజుల్లో ఇలాంటి అనిశ్చితి కొనసాగితే ఎవరి మాట వినాలి, ఎవరికి జవాబుదారీగా ఉండాలి.. అనేది వారికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

చర్చనీయాంశంగా డిప్యూటేషన్ల రద్దు!

మంత్రి కొండా సురేఖ వివాదం ఎటూ తేలని పరిస్థితుల్లో.. అటవీ పర్యావరణ శాఖలో డిప్యూటేషన్ల రద్దు ఉత్తర్వులు సిబ్బందిలో చర్చకు దారితీశాయి. గత నెల ప్రారంభం నుంచీ దశలవారీగా డిప్యూటేషన్ల రద్దు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న లేదా అటవీ శాఖలోనే కేటాయించిన పోస్టుకు బదులుగా మరో చోట పనిచేస్తున్నా వారిని పాత స్థానంలోనే రిపోర్ట్ చేయాలని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) పలు సర్క్యులర్లు జారీ చేశారు. పంద్రాగస్టు ముందురోజు సైతం వరంగల్‌లోన్ కాకతీయ జూ పార్క్ ఇన్‌చార్జిగా ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ డిప్యూటేషన్‌‌ను రద్దు చేసి మహబూబాబాద్ జిల్లా గంగారంలోని పాత పోస్టులోకి పంపారు. ఈ తరహాలోనే మంత్రి కొండా సురేఖ వన మహోత్సవంపై రివ్యూ చేసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రోజే ముగ్గురు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల డిప్యూటేషన్ రద్దు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు అరణ్య భవన్‌లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నందునే ఈ ముగ్గురి డిప్యూటేషన్లను రద్దు చేసినట్లు సిబ్బందిలో అనుమానం మొదలైంది. దానికి బలం చేకూర్చేలా ఆ ముగ్గురూ మంత్రిని కలిసి గోడును వెళ్లబోసుకున్నట్లూ తెలిసింది. దీనిపై అధికారికంగా సమాచారం వెలుగులోకి రాలేదు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>