కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని నాయుడువాడ కమల్ రోడ్డులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాస శుక్రవారం వేడుకలను పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, పూజారి కృష్ణ ఆధ్వర్యంలో వాసవి మాతను రంగురంగుల గాజులతో చీర రూపంలో సుందరంగా అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.

