‘చల్మెడ’ కబ్జా చెర నుంచి కాపాడండి.. TRSతో ఆవేదన

కలం, కరీంనగర్: తనకు చెందిన విలువైన భూమిని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు చెందిన పాఠశాల యాజమాన్యం అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితురాలు కాసర్ల మంజుల ఆరోపించారు. గురువారం కరీంనగర్‌లో (TRS Karimnagar) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా బాద్యులు గుంజపడుగు హరిప్రసాద్‌తో కలిసి ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ మరణించిన తన భర్త ద్వారా వచ్చిన సొమ్ముతో తీగలగుట్టపల్లిలో 127 సర్వే నెంబర్‌లో రెండు దఫాలుగా (20 గుంటలు, 10 గుంటలు) మొత్తం 30 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు.

సదరు భూమికి సంబంధించి తన వద్ద పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయని, ధరణి నుంచి భూభారతిలో ఉండి ఇప్పటికీ రైతుబంధు సహాయం కూడా తన ఖాతాలోనే జమ అవుతోందని పేర్కొన్నారు. అయితే సదరు సర్వే నంబర్లలో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఇంచు జాగ కూడా లేకపోయినప్పటికీ, గత మూడు నెలల నుండి ఆ భూమి తనదేనంటూ అక్రమంగా హద్దులు చెరిపేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపించారు. 122 సర్వే నెంబర్ కు చెందిన తన భూమిలో 127 ను కలుపుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. తాను ఒంటరి మహిళనని, రామగుండంలో ఉంటాననే నెపంతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన స్థలంలోకి వెళ్తే చల్మెడ మనుషులు దాడికి యత్నిస్తున్నారని, కార్యాలయానికి పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసు వ్యవస్థను వాడుకొని కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలు కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కాగా రెండు నెలల క్రితం సర్వే కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ సర్వే అధికారులు వచ్చి సర్వే చేస్తుండగా చల్మెడ అనుచరులు అడ్డుకుని వారిని వెనక్కి పంపించివేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తన భూమిని తనకు ఇప్పించి, న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. బాధితురాలికి న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రశ్నిస్తే తనపై పరువునష్టం దావా వేయడం పరువు తక్కువ పని ఎద్దేవా చేశారు. న్యాయపరంగా, రాజకీయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, రంగరవేణి లక్ష్మణ్, బాసవేణి రాజేందర్, మడిపల్లి వినీత్, పూసాల రణదీర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>