కలం, జోగుళాంబ గద్వాల : గద్వాల (Gadwal) పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఏళ్ల తరబడి రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై భారీగా నీరు నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బుధవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువులను తలిపిస్తోంది. ఇక భారీ వర్షాలు కురిస్తే గద్వాల రోడ్ల పరిస్థితి ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడానికి కారణమైన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గద్వాల మున్సిపాలిటీపై ఉందని కాని మున్సిపల్ అధికారులు పాలకులు అవేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రజలు, స్థానిక వ్యాపారులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, యుద్ధప్రాతిపదికన రోడ్లకు తాత్కాలిక గుంతల పూడ్చివేత పనులు చేపడంతో పాటు డ్రైనేజీ పూడికతీత పనులను పూర్తి చేయాలని గద్వాల పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు.

