ఎంపీ లింగమనేని కుమారుడిపై కేసు

కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్‌పై (MP Lingamane­ni Son Sanjush) హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం కేసు నమోదయింది. ఈ నెల 16న కారుతో యువతిని సంజూష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్ కారు నడిపినట్లు నిర్ధారించారు. ఈ మేరకు సంజూష్‌పై పోలీసులు BNS 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..!

మాదాపూర్‌లోని ఇన్‌ఆర్బిట్ మాల్‌ సమీపంలో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగిని మృతి చెందింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ అంబీర్‌పేటలోని బాబు నగర్‌కు చెందిన పంజల అశ్విన్ కుమార్ గత 20 సంవత్సరాలుగా లైఫ్‌స్టైల్ షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 16న మధ్యాహ్నం సమయంలో ఇన్‌ఆర్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు భోజనం కోసం బయటకు వెళ్లారు.

వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల భారతి ముఖి అనే యువతి సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నారు. మరో ఉద్యోగిని 26 ఏళ్ల పూజా అశోక్ కూడా అదే స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ భోజనం కోసం ఐటీసీ కోహినూర్ సమీప ప్రాంతానికి వెళ్లారు. భోజనం ముగించుకుని తిరిగి ఇన్‌ఆర్బిట్ మాల్ వైపు వస్తుండగా మాల్‌ ముందు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో TG-09-G-0666 నంబరు గల కారు వేగంగా దూసుకొచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తలకు తీవ్రగాయమై..

కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ రోడ్డు దాటుతున్న భారతి ముఖిని ఢీకొట్టినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ప్రమాదం ధాటికి భారతి ముఖి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన భారతి ముఖిని అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ వైద్యుడు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అశ్విన్ కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లగా భారతి ముఖి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

ప్రమాదంపై ఆరా తీసిన అశ్విన్ కుమార్‌కు TG-09-G-0666 రిజిస్ట్రేషన్ నంబరు గల కారును సంజుష్ అనే వ్యక్తి నడుపుతున్నట్లు తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతి ముఖి మృతికి కారణమైన డ్రైవర్ సంజుష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 1238/2026 నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు రికార్డుల్లో పేర్కొన్నారు.

ప్రమాదానికి అసలు కారణాలు, కారు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాద సమయంలో రోడ్డు పరిస్థితులు, సీసీటీవీ దృశ్యాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రమాదానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు, వాహనం వివరాలు, డ్రైవర్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఒక సాధారణ భోజన విరామం అనంతరం తిరిగి విధులకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగుల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Also Read : కేరళకు పవన్ కళ్యాణ్.. 20 రోజులు అక్కడే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>