ఉప్పునుంతల ప్రభుత్వ దవాఖానాలో వైద్యుల కొరత

కలం, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (Uppununthala CHC)లో వైద్యుల కొరత కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర అనారోగ్య సమస్యలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఉప్పునుంతల ఆస్పత్రిలో అవసరమైన స్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ డి. బాల్సింగ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ఈ నెల 7న, డాక్టర్ ఎస్. మోతిలాల్, పీడియాట్రిషియన్ (చిన్న పిల్లల వైద్య నిపుణుడు) జూన్ 26న ఉప్పునుంతల సి హెచ్ సిలో విధులు నిర్వహించేందుకు అపాయింట్‌మెంట్ పొందారు.

అయితే, వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోట DME(డిస్టిక్ మెడికల్ ఎడ్యుకేషన్) లో ఆగస్టు 12న డా. బాల్ సింగ్, 7న డాక్టర్ మోతిలాల్ ఇరువురు రాజీనామా సమర్పించినప్పటికీ ఇప్పటికీ రిలీవింగ్ ఆర్డర్లు జారీ కాకపోవడంతో కొత్త పోస్టులో విధుల్లో చేరలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఒకవైపు వైద్యులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, మరోవైపు ఉప్పునుంతల దవాఖానలో వైద్యుల కొరత కొనసాగుతోంది.

ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నియమితులైన వైద్యులను వీలైనంత త్వరగా ఉన్న చోట నుంచి రిలీవ్ చేయించి, ఉప్పునుంతల లో వారి విధుల్లో తక్షణమే జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఇద్దరు వైద్యులు విధుల్లో చేరితే జనరల్ సర్జరీతో పాటు చిన్నపిల్లల వైద్య సేవలు కూడా స్థానిక ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా ప్రస్తుత సీజనల్ వ్యాధుల సమయంలో గ్రామీణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే , ఆరోగ్య మంత్రివర్యులు తక్షణమే చొరవ తీసుకుని, అపాయింట్‌మెంట్ పొందిన ఈ ఇద్దరు వైద్యులు ఎటువంటి ఆలస్యం లేకుండా ఉప్పునుంతల లో విధుల్లో చేరేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>