కలం, కరీంనగర్ బ్యూరో: భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు (Vijaya Ramana Rao) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా యువతకు రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేసిన అంశాలను గుర్తు చేశారు. అంతేకాకుండా దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన దూరదృష్టితో చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నుగిల్లా మల్లయ్య, కౌన్సిలర్లు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

