డబుల్ బెడ్‌రూం ఇళ్లపై టీఎఫ్‌టీయూ డిమాండ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రభుత్వానికి ఇంటి స్థలాల పట్టా సర్టిఫికెట్లు స్వాధీనం చేసిన నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని టీఎఫ్‌టీయూ (TFTU) జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ 133 చదరపు గజాల ప్రభుత్వ స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గురువారం టీఎఫ్‌టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల బాధితులు, ఇంటి స్థలం లేని పేదలు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏళ్ల క్రితం ఇంటి స్థలాల పట్టా సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఇళ్లు మంజూరు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరులో తీవ్ర అవినీతి జరిగిందని సమావేశంలో ఆరోపించారు. అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన విజయేంద్ర బోయి దివిటిపల్లి (Divitipally) డబుల్ బెడ్‌రూం ఇళ్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి సుమారు 130 ఇళ్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే అక్రమంగా ఇళ్లు మంజూరు చేసిన అప్పటి రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 130 మందితో పాటు మరో 324 మంది వరకు అర్హత లేని వారు దివిటిపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్లను అక్రమంగా పొందినట్లు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

2018లో అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఇంటి స్థలాల పట్టా సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారని తెలిపారు. పట్టా సర్టిఫికెట్లు అప్పగించిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సుమారు 888 మంది తమ పట్టా సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అప్పగించారని చెప్పారు. అయితే వారిలో కేవలం 100 మందికి మాత్రమే డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసి, మిగతా వారికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని యాదగిరి కోరారు.

మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలో సుమారు 1,200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, సొంత ఇల్లు, భూమి లేని పేదలకు 133 చదరపు గజాల చొప్పున ప్రభుత్వ స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌టీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం.డి. జలాల్ పాషా, డబుల్ బెడ్‌రూం ఇళ్ల బాధితులు, ఇల్లు-జాగా లేని పేదల సంఘం ప్రతినిధులు టీ. అనురాధ, లలితమ్మ, మహమ్మద్ సిరాజ్, ధనుంజయ చారి, జాఫర్ బి, జాంగీర్ బేగం, మహమ్మద్ బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>