డీ-8 కెనాల్‌ పరిధిలో మంత్రి జూపల్లి ప‌ర్య‌ట‌న‌

కలం, నాగర్ కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్‌పల్లి, ఏదుట్ల‌, గోపాలపేట, రేమ‌ద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం ప‌ర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా నీరు అందేలా చూడాలని సూచించారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ , కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు, సాగునీటిపారుదల‌ శాఖ అధికారులు, తదిత‌రులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>