కలం, స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను శక్తి ఫ్రేమ్ వర్క్‌లో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ (Station Ghanpur) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన ఐదో రోజుకు చేరింది. జీవో 97ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి చౌరస్తా వరకు చేరుకున్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు.
“మా డిప్లొమా.. మా గుర్తింపు.. మా భవిష్యత్” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ అధికారి కార్యాలయానికి చేరుకుని అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జీవో 97పై ప్రభుత్వం పునరాలోచించి విద్యార్థులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఐదు రోజులుగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా స్పందించి విద్యార్థుల ప్రతినిధులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జీవో 97ను పునఃపరిశీలించి, అవసరమైతే రద్దు చేసి విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తేల్చిచెప్పారు.
తాటికొండ రాజయ్య సంఘీభావం..
విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తాటికొండ రాజయ్య సంఘీభావం తెలిపారు. విద్యార్థుల ర్యాలీలో పాల్గొని వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

