కలం, నిర్మల్: కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా (Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట రాజన్న మాట్లాడుతూ.. ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని మే 2026 నాటికి నెలకు రూ.39,373లను అవసరాల ఆధారిత కనీస వేతనంగా టీయూసీఐ నిర్ణయించిందన్నారు.
కార్మికుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ మొత్తాన్నే కనీస వేతనంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల కొనుగోలు శక్తి తగ్గకుండా తగిన వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (వీడీఏ)ను కూడా కనీస వేతనానికి జోడించాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమకు తగిన న్యాయమైన వేతనం అందించడంతో పాటు, వారి కుటుంబాల కనీస అవసరాలు తీరే విధంగా వేతన విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరాల ఆధారిత కనీస వేతన సూత్రాన్ని నిజాయితీగా అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు బక్కన్న, జిల్లా కార్యదర్శి రామలక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షులు గంగన్న, సహాయ కార్యదర్శి గఫూర్, నాయకులు లక్ష్మి, గోదావరి తదితరులు పాల్గొన్నారు.

