కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం, జీవో నెం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal ) జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళన (Students Protest) చేపట్టారు. తరగతులను బహిష్కరించిన విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శక్తి స్కీం, జీవో 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని నినాదాలు చేశారు.
పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల సాంకేతిక విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కొత్త స్కీం పేరుతో ప్రభుత్వ సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విద్యార్థులు మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శక్తి స్కీం, జీవో నెం 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

