కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి (MLC Koti Reddy) తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు, ప్రయోజనాలు పొందిన ఆయన.. ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడంపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఉండి కూడా వేస్ట్ అనే అభిప్రాయం కేడర్ లో వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్ బై పోల్ సమయంలో అసెంబ్లీ టికెట్‌ను నోముల భగత్‌కు కేటాయించారు. అప్పుడు టికెట్ ఆశించిన కోటిరెడ్డిని అనంతరం ఎమ్మెల్సీని చేశారు. ఆ పదవితో తన సొంత ప్రాబల్యం పెంచుకోవడానికే తప్ప ఏనాడు పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదనే ఆరోపణలు ఉన్నాయి. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌తో వైరం ఉండగా.. పార్టీని రెండు వర్గాలుగా విభజించారని, దీంతో అక్కడ బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కోతలు, 22A నిషేధిత భూముల సమస్యలు, డిజైన్డ్ సర్వేలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజాప్రతినిధిగా పార్టీ తరఫున ప్రజల వైపు నిలబడి పోరాడాల్సి న ఎమ్మెల్సీ పూర్తి నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. అధినేత కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై అధికార పక్ష నేతలు విమర్శలు చేసినా మాట్లాడడం లేదని, పార్టీ నిరసనల్లోనైనా పాల్గొనడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీకి దూరం.. క్షేత్రస్థాయికి నై నై..
ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేయకపోవడంపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయికి వచ్చి పోరాడకుండా, కేవలం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్లకే పరిమితం కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నవేళ ముఖం చాటేసి ‘హ్యాండ్’ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
ఒకవైపు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, పదవి చేతిలో ఉన్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాత్రం గొంతు విప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన శైలిని మార్చుకుని ప్రజాక్షేత్రంలోకి రాకపోతే పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

