కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కొండా మురళి, సురేఖ దంపతులు.. ఇప్పుడు అదే పార్టీలో అలజడికి కేంద్రంగా మారారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వీరు కీలకంగా ఎదిగారు. అనంతరం రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. తాజాగా పరకాల (Parakala) టికెట్‌పై కొండా దంపతుల కూతురు కొండా సుస్మిత (Konda Susmitha) ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని టార్గెట్ చేసి ప్రశ్నించారు. ఇందుకు గీసుగొండ వేదికగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పరకాల నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించడం, లేదంటే స్వతంత్రంగా పోటీ చేస్తానని ఆమె స్పష్టత ఇవ్వడంతో పార్టీలో కొత్త సమీకరణాలపై చర్చకు తెరలేసింది.
వైఎస్ఆర్ హయాంలో ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లాలో కొండా మురళి, సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానంలో వైఎస్ఆర్ హయాంలో బలమైన ప్రాధాన్యం ఏర్పడింది. సురేఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. మురళి సైతం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. అక్కడ కూడా కీలక పదవులు పొందారు. అనంతరం రాజకీయ మార్పులతో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినా.. మరోసారి కొండా కుటుంబానికి తగిన ప్రాధాన్యం దక్కింది. సురేఖ మంత్రి అయ్యారు. దీంతో కొండా కుటుంబం మరోసారి అధికార కేంద్రానికి చేరింది. అయితే మురళికి ఎమ్మెల్సీ పదవి హామీ నెరవేర్చలేదనే అసంతృప్తి మాత్రం కుటుంబంలో ఉందనే ప్రచారం కొన్నాళ్లుగా వినిపిస్తోంది. తాజాగా సుస్మిత వ్యాఖ్యలతో అసంతృప్తి కాస్త విభేదాలుగా మారుతోందా? అన్న ప్రశ్న తలెత్తింది. ‘ఎమ్మెల్సీ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు’ అంటూ సుస్మిత నేరుగా సీఎం రేవంత్‌రెడ్డినే ప్రశ్నించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు మరింత రాజకీయ ప్రాధాన్యతగా మారాయి.
సాయం నుంచి సవాల్ వరకు?
తాజా పరిణామాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం రేవంత్‌రెడ్డి, కొండా కుటుంబ సంబంధాలపై చర్చ జరుగుతోంది. రేవంత్ టీపీసీసీ చీ ఎదగడంలో మురళి సాయం ఉందని సుస్మిత చెప్పి వీరి మధ్య గత రాజకీయ సంబంధాలను గుర్తు చేశారు. ‘ రేవంత్ పీసీసీ చీఫ్‌గా కావాలని కోరుకున్నతొలి వ్యక్తుల్లో కొండా దంపతులు ఉన్నారు’ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు అదే రేవంత్‌పై సుస్మిత తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఒకప్పుడు రాజకీయంగా కలిసి నడిచి.. ఇప్పుడు పరకాల టికెట్ పై విరోధులుగా మారిన పరిస్థితి ఏర్పడింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు ప్రకటించడం కొండా కుటుంబ అసంతృప్తికి కారణంగా మారినట్లు చర్చలో ఉంది.
‘పరకాల టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు?’ అని సుస్మిత ప్రశ్నించడం, వచ్చేసారి ‘ నేనే పరకాల ఎమ్మెల్యే’ అని ఆమె ప్రకటించుకోవడం ద్వారా కొండా కుటుంబం రాజకీయ లక్ష్యం స్పష్టమైందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ టికెట్ రాకపోయినా స్వతంత్రంగా పోటీ చేస్తాననే ప్రకటన పార్టీకి చిక్కులు తెచ్చేదిగా మారిందనే వ్యాఖ్యలు కేడర్ లో వినిపిస్తున్నాయి. కొండా కుటుంబానికి పరకాల, గీసుగొండ ప్రాంతాల్లోని రాజకీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కొండా ఫ్యామిలీ అడుగులు ఎటువైపు?
కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఇప్పుడు మూడు ప్రశ్నలు పార్టీ ముందున్నాయనే చర్చ నడుస్తోంది. పరకాల టికెట్ పై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కొండా కుటుంబాన్ని పార్టీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది? టికెట్ దక్కకపోతే సుస్మిత స్వతంత్రంగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో చర్చకు పెట్టాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న కొండా కుటుంబం.. ఇప్పుడు అదే పార్టీలో సీఎం నాయకత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరడం వెనుక ఉన్న రాజకీయ పరిణామాలపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పరకాల టికెట్ వివాదం ఒక్క సీటు పోరుగా మిగులుతుందా? లేక కొండా కుటుంబం, రేవంత్ వర్గం మధ్య పెద్ద రాజకీయ వివాదంగా మారుతుందా ? అధిష్ఠానం జోక్యంతో సద్దుమణుగుతుందా? లేక కొండా కుటుంబం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతుందా? అనే ప్రశ్నలకు భవిష్యత్ లో సమాధానాలు రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

