కాసులిస్తే పని.. లేకుంటే కొర్రీలే!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ (Town Planning) విభాగం అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ సామాన్యులను దోచుకుంటున్నారనే ఫిర్యాదులతో ఏసీబీ (ACB) ఫోకస్ పెట్టింది. ఏసీబీ డీఎస్పీల నేతృత్వంలో మంగళవారం రాత్రి కార్పొరేషన్ ఆఫీసులో ఆకస్మిక సోదాలు కలకలం రేపాయి. నగర శివారు, డివిజన్ల పరిధిలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కావాలనే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. “ లింక్ డాక్యుమెంట్ లేదు, భవన డిజైన్ సరిగా లేదు, రోడ్డు విస్తరణ తక్కువగా ఉంది” అంటూ రకరకాల కొర్రీలు పెడుతూ దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ లైసెన్స్డ్ ఇంజనీర్లు లేదా స్థానిక కార్పొరేటర్ల ద్వారా ‘ముడుపులు’ అందితే మాత్రం వారం రోజుల్లోనే అనుమతులు మంజూరువుతున్నాయి. ఒక్కో భవన నిర్మాణ అనుమతికి వేలు, లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారనే, నిబంధనలు లేకపోయినా వసూళ్లకు పాల్పడుతూ అనుమతులు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

లంచాలు తీసుకుంటూ..

సిటీలో నిబంధనల ఉల్లంఘన కామన్ గా మారింది. బడా బాబులు జీ ప్లస్ టూ అంతస్తుల కోసం అనుమతి తీసుకుని, ఐదు అంతస్తులు, ఆపైన పెంట్ హౌస్‌లను అక్రమంగా నిర్మిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లకు ఎలాంటి సెట్ బ్యాక్‌లు లేకుండా, రోడ్లను ఆక్రమిస్తూ వెలుస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగంపైనే ఉంటున్నాయంటే పరిస్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఫిర్యాదు చేసినా అధికారులు లంచాలు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు నిజమేనని ఏసీబీ సోదాలు నిరూపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలతో కార్పొరేషన్ కు రూ. కోట్ల ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

తిష్ట వేసిన అధికారులు..పనులు చక్కబెడుతూ..

టౌన్ ప్లానింగ్‌లో కొందరు కీలక అధికారులు ఏజెంట్లుగా మారిన ప్రైవేట్ లైసెన్స్డ్ ఇంజనీర్లు, దళారులతో కమ్మక్కు అయ్యారు. సామాన్యులు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి తిప్పుకునే అధికారులు, ప్రైవేట్ సిండికేట్ లేదా కొందరు స్థానిక కార్పొరేటర్ల ద్వారా వచ్చే ఫైళ్లను వారం రోజుల్లోనే క్లియర్ చేస్తున్నట్లు ఆధారాలు ఏసీబీకి లభించాయి. నగదుగా కాకుండా గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా ముడుపులు తీసుకుంటున్నారనే సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్‌ ఏసీబీ రేంజ్‌ డీఎస్పీ మహేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, ప్రేమ్ కుమార్‌ టీమ్ కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ పై ఆకస్మిక దాడులు చేసింది. రాత్రి వరకు సోదాలు కొనసాగించింది. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని, బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలించింది. అనుమానాస్పద బదిలీలపై ఆరా తీసింది. తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో తిష్టవేసిన పాత అధికారులు, క్షేత్రస్థాయికి వెళ్లే కొత్త ఇంజనీర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కొత్తగా వచ్చే ఇంజనీర్లు సైట్ విజిట్ చేసి ఫైల్స్ క్లియర్ చేస్తున్నా, లంచాలు అందకపోతే పాత సిబ్బంది ‘షార్ట్ ఫాల్స్’ పేరుతో ఫైళ్లను వెనక్కి తిప్పి పంపుతున్నారనే అంతర్గత వివాదాలు కూడా దాడుల్లో వెలుగు చూసినట్లు తెలిసింది.

బాధితుడి ప్రత్యక్ష సాక్ష్యం

ఏసీబీ సోదాల సమయంలోనే భగత్ నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీపతిరావు స్వయంగా అధికారులను కలిసి ఫిర్యాదు చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తీగలగుట్టపల్లిలోని తన సొంత స్థలంలోకి చొరబడి ఓ వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని, దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, డబ్బులు ఇస్తేనే పని జరుగుతోందని బాధితుడు ఏసీబీ డీఎస్పీ ముందే వాపోయాడు.

దాడులతో సిబ్బంది పరార్

ఏసీబీ సుదీర్ఘ సోదాలతో కార్పొరేషన్ లోని ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది భయాందోళనలో పడిపోయారు. ఏసీబీ సమాచారం అందగానే టౌన్ ప్లానింగ్, ఇతర విభాగాలకు చెందిన కొందరు అధికారులు ఆఫీసు వైపు రాకుండా మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసుకుని పారిపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొన్నప్పటికీ ఏసీబీ తదుపరి చర్యలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ బల్దియాలో ఏసీబీ దాడులు అవినీతి రహిత పాలన అందిస్తామన్నకేంద్ర మంత్రి బండి సంజయ్ కు సవాలుగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>