సోలార్ పవర్‌తో పేదలకు అదనపు ఆదాయం!

కలం, ఖమ్మం బ్యూరో:  జీరో కరెంట్ బిల్లుతోపాటు, మిగిలిన విద్యుత్‌ను అమ్మి ప్రతి నెలా అదనపు ఆదాయం పొందే అద్భుత అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తోంది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు పేద కుటుంబాల విద్యుత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామాన్ని ‘మోడల్ సోలార్ విలేజ్’గా ఎంపిక చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ప్రారంభించారు.

​చెరువుమాధారంలో ప్రాథమికంగా రూఫ్‌టాప్ సదుపాయం ఉన్న 713 గృహాలకు ఈ సోలార్ ప్యానళ్లను అమర్చారు. ప్రతి 2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ద్వారా నెలకు సుమారు 250 నుంచి 270 యూనిట్ల విద్యుత్ (Solar Power) ఉత్పత్తి అవుతుంది. ఒక కుటుంబం సాధారణంగా వినియోగించే 140 నుంచి 150 యూనిట్లు పోను, మిగిలిన విద్యుత్‌ను నేరుగా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. ఆ మిగులు విద్యుత్ విలువను నిబంధనల ప్రకారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా పేద కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరుతుంది.

​గృహ విద్యుత్‌కే పరిమితం కాకుండా, రైతుల 10 హెచ్‌పి సామర్థ్యం గల వ్యవసాయ మోటార్లకు సోలార్ విద్యుత్ అందించేలా చెరువుమాధారంలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్యానెళ్లపై దుమ్ము చేరకుండా కేవలం నీటితో శుభ్రం చేస్తూ జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ లబ్ధిదారులకు సూచించారు. అనంతరం బుద్దారం, కొంగర గ్రామాల్లో రూ. 3.02 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>