నర్సింగ్ కాలేజీని 18 నెలల్లో నిర్మిస్తాం : ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : నర్సింగ్ కాలేజీ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నామని, స్థలం సమకూర్చుకోవడం, ల్యాండ్ అక్విజిషన్‌లో ఎదురైన ఇబ్బందులను అధిగమించి, మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం నర్సింగ్ కళాశాల , హాస్టల్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తిరుమల హిల్స్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే ఐదు ఎకరాల స్థలాన్ని నర్సింగ్ కాలేజీకి కేటాయించి, రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ఈ నిధులతో నర్సింగ్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలను రెండు బ్లాకులుగా నిర్మించనున్నట్లు తెలిపారు. మొత్తం దాదాపు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపడుతున్నామని యెన్నం వెల్లడించారు. ఇందులో కాలేజీ బ్లాక్ సుమారు 45,062 చదరపు అడుగులు, హాస్టల్ బ్లాక్ సుమారు 44,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుందని ఆయన వివరించారు. నర్సింగ్ కాలేజీ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని, నిర్ణీత సమయంలో పనులు పూర్తయితే మహబూబ్‌నగర్‌కు ఇది ఒక గొప్ప ఆస్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే యెన్నం అన్నారు.

త్వరలో ప్రారంభం కానున్న కొత్త జనరల్ హాస్పిటల్‌కు నర్సింగ్ విద్యార్థుల సేవలు, శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. మెడికల్ కాలేజీ క్యాంపస్ నుంచి జనరల్ హాస్పిటల్‌కు బస్ సౌకర్యం కల్పిస్తే నర్సింగ్ విద్యార్థులు, ట్రైనీలు క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లి ప్రాక్టికల్ శిక్షణ పొందడంతో పాటు ప్రజలకు సేవలందించే అవకాశం ఉంటుందన్నారు. నర్సింగ్ కాలేజీ అత్యాధునిక సదుపాయాలతో, అద్భుతమైన వసతులతో నిర్మించనున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ లలిత భానుచందర్, నాయకులు మైత్రి యాదయ్య, వాల్ధాస్ ప్రతాప్ గౌడ్, జేసిఆర్, శ్రీశైలం, గ్యాస్ అంజి, గోపాల్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రమేష్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రాగిణి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>