ఆక్రమణలు సహించేది లేదు.. మంత్రి పొంగులేటి వార్నింగ్..!

కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎంతమాత్రం సహించేది లేదని, ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. ​ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి మంత్రి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి (Minister Ponguleti) మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందుకోసమే పల్లెగూడెంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, భూములను సమీకరించి అర్హులకు ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ​పల్లెగూడెం సమగ్ర వికాసానికి రూ. 61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

గ్రామంలో ఇప్పటికే రూ. 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, గొల్లగూడెం నుంచి పల్లెగూడెం వరకు ఎన్ఎస్పీ కాల్వ గట్టుపై రూ. 5.80 కోట్లతో మోడల్ సీసీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా, పల్లెగూడెం నుంచి మంగళగూడెం వరకు రూ. 55 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ​రూ. 20 లక్షల వ్యయంతో పంచాయతీ కార్యాలయ భవనాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలోనే నాణ్యతతో పూర్తి చేయడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందించారు.

గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రూ. 12 లక్షలతో నూతన అంగన్‌వాడీ భవనాన్ని కూడా తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : సుతార్ సూపర్ షో.. గాలెలో భారత్ గెలుపు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>