కలం, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో ‘పరకాల’ (Parakala) పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు కొండా సురేఖ దంపతులు తమ కుమార్తె కొండా సుస్మిత (Konda Susmita)ను రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి బరిలో దింపుతామని చెప్పుకుంటున్న తరుణంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తీవ్ర దుమారాన్ని రేపింది. తాజాగా పరకాల కాబోయే ఎమ్మెల్యే అంటూ ఇన్‌స్టా స్టోరీతో సీఎంకు కౌంటర్ ఇచ్చిన కొండా సుస్మిత మళ్లీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో జరిగిన కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో కొండా సుస్మిత మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌ను ఎలా ప్రకటిస్తారని సుస్మిత ప్రశ్నించారు. అసలు పరకాలలో రేవూరి ఎవరికైనా తెలుసా? అని నిలదీశారు. “నా ఇలాకాకు వచ్చి నాతోనే పెట్టుకుంటారా?” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రేవూరికి సుస్మిత సవాల్ విసిరారు. పరకాలలో పోటీ చేసేది, గెలిచేది తానేనని తేల్చి చెప్పారు. కొండా దంపతులు మంచి వాళ్లు కాబట్టే ఇన్నాళ్లూ మౌనంగా ఉంటున్నారని అన్నారు. త్వరలో పరకాలలో ఇల్లు కట్టుకుంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పరకాలకు మరో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా తానే ఉంటానని సుస్మిత అన్నారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని కొండా దంపతులే అధిష్టానాన్ని అడిగారని సుస్మిత అన్నారు. పీసీసీ చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారా? లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని సుస్మిత వెల్లడించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పి మురళిని మోసం చేశారన్నారు. కొండా మురళికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని సీఎంను ప్రశ్నించారు. సీఎం రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని సుస్మిత విమర్శించారు. కొందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు అటు పరకాల నియోజకవర్గంలో, ఇటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

