కలం, వెబ్డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (MLC Duvvada Srinivas) మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిందని, ప్రజా సమస్యలు పరిష్కరించడంతో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగం దారుణంగా తయారైందని, రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని అన్నారు. ముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అని సంబోధించి, క్షమించండి అధ్యక్షా ఆంబోతు అంటూ వ్యవంగ్యస్త్రాలు సంధించారు. ఆంబోతును సభకు రమ్మనండి, వచ్చి రైతుల సమస్యలపై మాట్లాడమని చెప్పండని డిమాండ్ చేశారు.
రైతులు యూరియా కోసం క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు పడుతున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో యూరియా కోసం క్యూలో నిల్చొని తొక్కిసలాటలో ఓ పేద మహిళ మరణించిందని దువ్వాడ తెలిపారు. ఈ ఘటన టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం పెద్దనావుని పల్లి అనే గ్రామంలో జరిగిందని తెలిపారు. రైతులకు ప్రభుత్వం యూరియా, పొటాషియం, డీఏపీ, ఏవీ అందించడం లేదన్నారు. వరి చేను రంగు మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని చెప్పారు. వైసీపీ హయాంలో ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ కట్టి, ప్రతి పంటకు ఎరువులు, విత్తనాలు ముందస్తుగా అంచనా వేసి సకాలంలో అందించామన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇవన్నీ సభా వేదికగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆరోగ్య శ్రీని కూడా నిర్వీర్యం చేశారని దువ్వాడ మండిపడ్డారు.

