కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రేషన్ బియ్యం సక్రమంగా అందించాలని అదనపు కలెక్టర్ (Additional Collector) జేఎల్బీ హరిప్రియ (Hari Priya ) తెలిపారు. జడ్చర్ల (Jadcherla) పట్టణంలోని మదీనా కాలనీలో గల చౌక ధర దుకాణాన్ని (Ration Shop) రెవెన్యూ అదనపు కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జడ్చర్ల తహశీల్దార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, డీటీతో కలిసి చౌక ధర దుకాణం నంబర్ 1423001ను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు, పంపిణీ ప్రక్రియ, రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సక్రమంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. ఈ తనిఖీలో జడ్చర్ల తహశీల్దార్ నర్సింగరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ, డీటీ తదితరులు పాల్గొన్నారు.

