ఝలక్ ఇస్తారా.. సర్దుకుపోతారా : రాజగోపాల్ రెడ్డి డుమ్మాల వెనుక అసలు కథ!

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ప్రాదేశిక వ్యవహారాల కమిటీ (PAC) సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy)తో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు గైర్హాజరు కావడం రాష్ట్ర పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం పీఏసీ సమావేశానికే కాకుండా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనకు సైతం ఆయన దూరంగా ఉండటం చూస్తుంటే.. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ తీవ్రమైందనే స్పష్టత వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డికి మంత్రిగా స్థానం కల్పించడంతో ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇవ్వడం కుదరదనే సామాజిక, రాజకీయ సమీకరణాలతో రాజగోపాల్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది.

పార్టీలో ఉంటానంటూనే ధిక్కరణ..

రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీలోనే ఉంటానని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చెబుతున్నప్పటికీ పీసీసీ నిర్ణయాలను, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటనను ఆయన లెక్కలోకి తీసుకుంటున్నట్లు లేదు. మునుగోడు క్యాడర్ అంతా ఒక్కటై పీసీసీ మీటింగ్ కు డుమ్మా కొట్టడం వెనుక.. రాజగోపాల్ రెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే నిరసనను అధిష్ఠానానికి స్పష్టంగా తెలియజెప్పే వ్యూహమే ఉందనే టాక్ ఉంది.

నిజానికి నల్లగొండ రాజకీయాల్లో దశాబ్దాలుగా కోమటిరెడ్డి సోదరులకు పట్టు ఉంది. నల్లగొండ, భువనగిరి, మునుగోడు ప్రాంతాల్లో కోమటిరెడ్డి సోదరులకు బలమైన అనుచరగణం ఉంది. పైగా జిల్లాలో ఎప్పటి నుంచో ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. స్థానిక సంస్థల పదవులు, నియోజకవర్గ నిధుల కేటాయింపులో తమ వర్గానికి అన్యాయం జరుగుతుందనే భావన రాజగోపాల్ రెడ్డి వర్గంలో ఉందనేది కొట్టిపారేయలేని నిజం.

ఇంత జరుగుతున్నాపీసీసీ గానీ, కాంగ్రెస్ అధిష్ఠానం గానీ రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ప్రజల్లో బలమే. చర్యలు తీసుకుంటే జిల్లాలో పార్టీ అంతర్గత విబేధాలు మరింత రచ్చకెక్కుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని అధిష్ఠానం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది.

అధిష్టానానికి తలనొప్పి

రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారం పార్టీకి కేవలం అంతర్గత విభేదంగానే కాక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ)పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా, ముఖ్యంగా మునుగోడు లో రాజగోపాల్ రెడ్డికి సొంత అనుచరగణంతో పాటు క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అధిష్ఠానంతో విభేదాలు ఇలాగే కొనసాగితే, అధికారిక అభ్యర్థులకు రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) వర్గం నుంచి సహకారం లభించకపోవడమే కాకుండా, పరోక్షంగా క్రాస్ ఓటింగ్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పెరిగే అవకాశాలు లేకపోలేదు.

ఇప్పటికే గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అధినాయకత్వ ధోరణిపై అసంతృప్తితో ఉండటంతో వారిని ఏకం చేసి ఎన్నికల బరిలోకి దింపితే ఇతర పార్టీలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. స్థానిక పోరులో పట్టు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తుండగా, విభేదాలను తక్షణమే చల్లార్చకపోతే జిల్లాలో తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.

ఝలక్ ఇస్తారా? సామరస్యమా..?

ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో లేనప్పటికీ, వరుస డుమ్మాల ద్వారా రాష్ట్ర నాయకత్వంపై పరోక్ష ఒత్తిడి పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో కేబినెట్ విస్తరణ లేదా కార్పొరేషన్ పదవుల కేటాయింపుల్లో తమ వర్గానికి తగిన ప్రాధాన్యం లభించకపోతే ఆయన ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానం తక్షణమే కల్పించుకుని జిల్లాలోని సీనియర్ల మధ్య సమన్వయం కుదర్చకపోతే వర్గపోరు భవిష్యత్ లో పార్టీకి పెను సవాల్ గా మారడం ఖాయమనే చర్చ కేడర్ లో జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>