కనకాపూర్‌లో పోలీసుల తనిఖీలు.. 64 వాహనాలు సీజ్‌

కలం, నిర్మల్: లక్ష్మణచందా మండలం కనకాపూర్‌ (Kanakapur) గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ (Cordon and search) నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, మూడు గూడ్స్‌ క్యారియర్‌ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లను కూడా వసూలు చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు గ్రామంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతో పాటు నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని గ్రామస్తులకు సూచించారు. అనంతరం గ్రామస్తులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్‌ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ శ్రీనివాస్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో సోన్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు శ్రావణి, గోపి, హన్మాండ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>