బుగ్గారంలో ఇందిరమ్మ ఇళ్ల వివాదం.. లబ్దిదారుల ఆందోళన

కలం, జగిత్యాల: జిల్లాలోని బుగ్గారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల వివాదం నెలకొంది. గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు లబ్దిదారుల ఆందోళన చేపట్టారు. ఇళ్లు కాలిపోయి కొందరు, గుడిసెల్లో ఉంటున్నా మరికొందరు, ఇళ్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, తీరా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్లు మంజూరై కట్టుకుంటే ఆర్టీఐ కార్యకర్త, పంచాయతీ కార్యదర్శిల వల్ల బిల్లులు రాకుండాపోయాయని బుగ్గారం (Buggaram) ఇందిరమ్మ లబ్దిదారులు వాపోతున్నారు. మంగళవారం పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి అక్బర్ ను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

లబ్దిదారులు మాట్లాడుతూ. 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సొంత ఇల్లు లేక రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదని, చివరికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ కృషితో 40 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, చివరి దశ వచ్చే బిల్లులు రాకుండా పోయాయాని వాపోయారు. అయితే మంజూరు పత్రాల వివరాలు కావాలంటూ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి దరఖాస్తు చేయడంతో, పంచాయతీ కార్యదర్శి అక్బర్ 40 మంది లబ్దిదారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో తమ బిల్లులు ఆగిపోయాయని లబ్దిదారులు మండిపడ్డారు.

లబ్దిదారుల ఆగ్రహం..

“మా పొట్ట కొడతారా? పిల్లలకు తిండి పెట్టనివ్వరా? ఆర్టీఐ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారా?” అంటూ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఎండి అక్బర్, ఆర్టీఐ కార్యకర్త గంగారెడ్డి అడ్డుపడొద్దని హెచ్చరించారు. ఇల్లులేని తమకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే వీరికేంటి నొప్పి అంటూ మండిపడ్డారు. వెంటనే బిల్లులు ఇవ్వకుంటే ధర్నాలు చేస్తామని.. ఎవరినీ వదిలిపెట్టమని మహిళలు హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి పేద ప్రజల పక్షాన ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలి తప్పా పేదల కడుపు కొట్టొద్దని, బిల్లులు మంజూరుకు సంబందించిన పత్రాలు అధికారులకు సమర్పించి వెంటనే బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

పేదలను ఇబ్బంది పెడితే ఊరుకోం – నర్సాగౌడ్

ఈ అంశంపై స్పందించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లు లేని ఎల్ 1 లిస్టులో ఉన్న అర్హులకే ఇందిరమ్మ కమిటీ ద్వారా ఇళ్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికే ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజలను మళ్లీ ఎవరైనా ఇబ్బంది పెడితే సహించెందిలేదని ,ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హెచ్చరించారు.

పేదలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని నర్సాగౌడ్ భరోసా ఇచ్చారు. బుగ్గారం మండలానికి సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో 200 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా కేవలం బుగ్గారం గ్రామానికే 40 మంజూరయ్యాయని స్పష్టం చేశారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎవరు అడ్డుకోవద్దని చెబుతూ, పేదల పొట్టలు కొట్టవద్దని సూచించారు.

ఆర్టీఐ మేరకే నోటీసులు ఇచ్చాం – కార్యదర్శి అక్బర్

పంచాయతీ కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టం ప్రకారం వచ్చిన దరఖాస్తు ఆధారంగానే లబ్దిదారులకు నోటీసులు ఇచ్చానని తెలిపారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదన్నారు. లబ్దిదారుల సమస్యను ఎంపిడిఓ దృష్టికి తీసుకెళ్లి బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారుల లెక్కల ప్రకారం బుగ్గారం మండలానికి మొత్తం 200 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, కేవలం ఒక్క బుగ్గారం గ్రామానికి 40 ఇళ్లు మంజూరయ్యాయి. చివరికి బిల్లులు చెల్లించాలని లబ్దిదారులు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీఐ పారదర్శకత కోసం తెచ్చినా, అది పేదలకు ఇబ్బందిగా మారిందనే చర్చ ఇప్పుడు బుగ్గారం మండలంలో జోరుగా సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>