కలం, నల్లగొండ: రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22 ఏ (నిషేధిత భూముల) జాబితా వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల పాత్ర దీని వెనుక ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నల్లగొండలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాత్రికి రాత్రే వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో ఏకంగా 42 వేల ఎకరాలను 22A జాబితాలో పెట్టారని, ఈ విషయమై నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.
22 ఏ సమస్య పరిష్కారం కోసం బాధితులు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. బాధితులందరికీ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ తప్పులు పొరపాటున జరిగాయా లేదా కావాలనే కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పొలాల వద్ద క్షేత్రస్థాయి విచారణ జరుపుతామని వెల్లడించారు.
గతంలో జరిగిన 30 శాతం కమిషన్ల వ్యవహారాలు కూడా ఈ దర్యాప్తు ద్వారా బయటపడతాయని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వ మంచితనాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత 22A జాబితా వ్యవహారంపై సమగ్రమైన శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. మధ్యతరగతి, పేద ప్రజలకు 22 ఏ వల్ల అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అర్థం లేదని కొట్టిపారేశారు.

