కలం, కరీంనగర్ బ్యూరో: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమని.. ఆయన ఆశయాలను అందరం కొనసాగిద్దామని కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra) పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సర్వాయి పాపన్న 376 వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు, బీసీ, గౌడ సంక్షేమ సంఘం నాయకులు సర్వాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
కల్లు గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్మికులకు ఎక్స్ గ్రేషియా, కాటమయ్య రక్షణ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. సంఘం నాయకులతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఐక్యంగా పని చేస్తూ.. నియోజకవర్గాల వారీగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదువు, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తమ సంఘంలో బాలికల చదువుకు పెద్దపీట వేసి వారు ఉన్నత స్థానాల్లో నిలిచేలా కృషి చేయాలన్నారు.
ఎక్సైజ్ శాఖ సమన్వయంతో జిల్లాలోని 3412 మంది కల్లుగీత కార్మికులకు (అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కరీంనగర్ 463, మానకొండూర్ 933, చొప్పదండి 975, హుజురాబాద్ 1041) కాటమయ్య సేఫ్టీ కిట్లు అందించినట్లు పేర్కొన్నారు. నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. జనగాం జిల్లాలో ఆయన నిర్మించిన కోట ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందన్నారు. ఆ మహనీయుడు ఆశయాలను, జీవన విధానం , దూరదృష్టి నేటి తరానికి తెలియజేయాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాపన్నలాంటి వీరులు అన్ని వర్గాలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ స్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, తెలంగాణ గౌడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పడాల స్వామి, గౌడ్ పులి ఆంజనేయులు గౌడ్, పడాల అజయ్ గౌడ్, దూలం అంజన్న గౌడ్, తాళ్లపల్లి ఎల్లగౌడ్, మాచర్ల ఆంజనేయులు గౌడ్ , బుర్ర ముత్తయ్య గౌడ్, సాగర్ గౌడ్ నరసయ్య గౌడ్, రాజు గౌడ్, రమేష్ గౌడ్,మహిళా నాయకులు సుజాత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

