కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్థరాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో తొలగించారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
విగ్రహ తొలగింపు ప్రక్రియ జరుగుతున్న సమయంలో పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కూడా సెల్ ఫోన్లు ఉపయోగించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం గమనార్హం.
ఈ చర్యపై బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ తొలగింపు సమాచారం అందుకోవడంతో నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున నర్సంపేటకు తరలివస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో దాదాపు 400 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. నిరసనలకు దిగకుండా ఇంట్లో నిద్రిస్తున్న పలువురు బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అర్ధరాత్రి వేళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మొత్తంగా ఈ ప్రక్రియ కోసం 1,500 మందికి పైగా పోలీసు బలగాలను నర్సంపేట వ్యాప్తంగా మోహరించినట్లు సమాచారం. ఒకవైపు విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తుండటంతో పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

