కలం, జగిత్యాల: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై (Kalyana Lakshmi, Shaadi Mubarak Schemes) హైకోర్టు మధ్యంతర స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు. సోమవారం జగిత్యాలలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పథకాలకు సంబంధించిన ఎనిమిది జీవోలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చినా, ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని ఈశ్వర్ విమర్శించారు. ప్రభుత్వం తరఫున సరైన సమయంలో కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే స్టే కొనసాగుతోందని ఆరోపించారు.
హైకోర్టు స్టే కారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెల్లింపులు నిలిచిపోయాయని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వేలాది పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వివాహాలు చేసుకుని ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. సంక్షేమ పథకాలను చట్టపరంగా సమర్థించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వెనుక వాటిని క్రమంగా ఎత్తివేసే దురుద్దేశం ఉందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయాన్ని రూ.51,000 నుంచి రూ.1,00,116కు పెంచినట్లు కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.13,484.69 కోట్లను పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యాన్ని వీడి హైకోర్టులో సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. నిపుణులైన న్యాయవాదులను నియమించి సమర్థవంతంగా వాదనలు వినిపించి స్టేను ఎత్తివేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న లక్షలాది దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి అర్హులైన పేద కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే పేద ప్రజల తరఫున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.

