కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహ కల్పలో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. రాజీవ్ గృహ కల్పలోని ఇళ్లను సోమవారం ఆయన స్వయంగా పరిశీలించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను పరిశీలించిన యెన్నం.. ఇళ్ల పరిస్థితిపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే బలహీనంగా మారిన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు నివసించడం ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలని విప్ సూచించారు. ఇళ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నివసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాజీవ్ గృహ కల్పలో నివసిస్తున్న కుటుంబాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అక్కడి ప్రజలకు మేలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సావధానంగా విన్న ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్.పి. వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహర్, మైత్రి యాదయ్య వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

