కలం, నిర్మల్: దేవాలయాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను నిర్మల్ పోలీసులు (Nirmal Police) అరెస్టు చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో దేవాలయాలు, ఇళ్లలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో ఎస్పీ జానకి షర్మిల (Janaki Sharmila) ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించిన పోలీసులు (Nirmal Police) నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్‌కు చెందిన రాజశేఖర్, రాజేశ్వర్, శ్రీకాంత్, రాంచరణ్, క్రాంతిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 75 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులకు జిల్లాలో జరిగిన 25 చోరీల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని, అందులో 16 దొంగతనం కేసులను ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం, ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయాల్లోనూ ఇదే ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని వెల్లడించారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు సమ్మయ్య, కృష్ణ, ఎస్సైలు లింబాద్రి, గణేష్, ఎస్.కె. గఫర్, హెడ్ కానిస్టేబుల్ జగన్ సింగ్, కానిస్టేబుళ్లు తిరుపతి, సతీష్ లను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.
Also Read : నిషేధిత భూములపై పొంగులేటి కీలక ప్రకటన
Follow Us On: Instagram

