కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పనికి 30 శాతం కమీషన్ ఇస్తేనే చేస్తున్నారని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. రెవెన్యూ శాఖలో పైసలు ఇస్తేనే పని అవుతుందని.. లేకపోతే ఫైల్ కదలడం లేదని తీవ్రంగా విమర్శించారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత భూముల జాబితాలో ఉందని.. అందుకే హడావిడిగా ఈ భూములపై శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. సీఎం నివాసమే నిషేధిత జాబితాలో ఉంటే, మరి సామాన్యుల భూముల పరిస్థితి ఏంటన్నారు.
కల్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర..
కేసీఆర్ ప్రారంభించిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. తమ హయాంలో రూ.లక్ష రుణమాఫీ చేసినందుకే రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రూ.20 వేల కోట్లే ఎలా ఖర్చవుతాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఎన్నిసార్లు రైతు భరోసా కింద అందించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

