కలం, ఖమ్మం బ్యూరో: నిరంతరం రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతూ, సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలని భద్రాద్రి కొత్తగూడెం (Bhadadri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఇల్లందు పోలీస్ స్టేషన్ (Yellandu PS) ను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం, అధికారులతో మాట్లాడి వివిధ విభాగాల పనితీరును, వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు మోసపోకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి వారికి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అలాగే సీసీటీఎన్ఎస్ 2.0, సీఈఐఆర్ పోర్టల్‌తో పాటు నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోలీసు సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని పిలుపునిచ్చారు. డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవాలని, పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ సురేష్, ఎస్సైలు ఉమా, సారంగపాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

