కలం, జోగులాంబ గద్వాల: గత కొంత కాలంగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని గట్టు మండలం పెంచికలపాడు గ్రామస్థులు ఆందోళనకు (Penchikalpahad Protest) దిగారు. సోమవారం ఉదయం పెంచికలపాడు గ్రామంలోకి ఆర్టీసి బస్సు రావడంతో గ్రామస్తులు బస్సును అడ్డగించి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గద్వాల నుంచి గట్టుకు వయా పెంచికలపాడు, ఆరగిద్ద గ్రామాలకు వెళ్లే ఆర్టీసి బస్సు గత కొంతకాలంగా పెంచికలపాడు గ్రామంలోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెంచికలపాడు గ్రామానికి చెందిన సరిత (రెండునెలల గర్బిణి) తన భర్త, 11నెలల చిన్నారితో కలిసి హైదరాబాద్ నుంచి గద్వాలకు రాగా, ఆదివారం రాత్రి 9.15 గంటలకు పెంచికలపాడు వెళ్లేందుకు గద్వాలలో బస్సు ఎక్కింది. రాత్రి 10.45 గంటలకు ఆర్టీసి సిబ్బంది బస్సును పెంచికలపాడు గ్రామంలోకి తీసుకెళ్లకుండా వారిని స్టేజ్ మీద దింపేసి వెళ్లారని, రాత్రి వేళ్లలో 1.5 కి.మీ నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్నిరోజుల నుంచి ఆర్టీసి బస్సు లోపలికి రాకుండా ప్రయాణికులను ప్రధాన రహదారిపై ఉన్న స్టేజీ సమీపంలోనే వదిలి వెళ్తుండటంతో వృద్ధులు, మహిళలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. గ్రామస్థుల సమస్యపై సర్పంచ్ ఆంజనేయులు ఆర్టీసీ డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఆర్టీసి బస్సులను యథావిధిగా గ్రామం లోపలికి నడిపించాలని డిపో మేనేజర్‌ను కోరారు. దీనిపై స్పందించిన డీఎం, సమస్యను త్వరలోనే పరిష్కరించి, బస్సులను సక్రమంగా గ్రామానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్, ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో గ్రామస్థులు తమ నిరసనను విరమించారు.

