కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండల పరిధిలోని సమితిసింగారంలో 19 మేకలు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. బాధితుడు రాచకొండ రాములు వివరాల ప్రకారం.. రోజువారీగా మేత కోసం బయటకు వెళ్లిన మేకలు తిరిగి వస్తుండగా, మణుగూరు ఓసీ-2 చెక్‌పోస్టు సమీపంలో ఉన్న బ్లాస్టింగ్ సెక్షన్ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాగులో నీరు తాగాయి.
ఆ కలుషిత నీరు తాగిన కొద్దిసేపటికే మేకలు మృతిచెందాయి. దీంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి, న్యాయం చేయాలని రైతు రాములు కోరారు.

