కలం, నిర్మల్: హైదరాబాద్లోని(Hyderabad) ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ (Journalist Association) రాష్ట్ర స్థాయి రెండో మహాసభ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా మండాజీ మారుతిని సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, అలాగే విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అభివృద్ధి కోసం అసోసియేషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని తీర్మానించారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసి జర్నలిస్టులకు అండగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వానికి మండాజీ మారుతి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

